ఫొటో సోర్స్, RT / Provided

ఇజ్రాయెల్‌కు చెందిన ఓ పర్యటకుడు, శ్రీలంక టూర్ గైడ్‌ను పడవ నుంచి సముద్రంలోకి తోసేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ ఆర్‌టీ తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది.

''శ్రీలంకకు చెందిన ఓ కార్మికుడిని పడవ నుంచి సముద్రంలోకి తోసేస్తుంటే, ఇజ్రాయెల్ పర్యటకులు నవ్వుతూ వీడియో తీస్తున్నారు'' అని పేర్కొంది.

‘‘అయితే ఇదంతా సరదా కోసమే చేశామని, సదరు వ్యక్తిని బాధపెట్టాలనే లేదా అవమానించాలనే ఉద్దేశం మాకు లేదు. మేం మంచి పిల్లలం’’ అని సంబంధిత పర్యటకులు చెప్పినట్లు ఆర్‌టీ వార్తా కథనం వెల్లడించింది.

ఇజ్రాయెల్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త డేనియల్ అమ్రామ్ ఈ విషయాన్ని తెలిపినట్లు పేర్కొంది.

డేనియల్ అమ్రామ్ ఎక్స్ ఖాతాను పరిశీలించిన బీబీసీ సింహళ సర్వీస్.. సదరు పర్యటకులు శ్రీలంక టూరిస్ట్ గైడ్ కలిసి ఉన్న ఒక ఫోటోను ఆయన షేర్ చేస్తూ, ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు నిర్థరించుకుంది.

అసలేం జరిగింది?

ఈ ఘటనపై బీబీసీ సింహళ సర్వీస్ మరింత లోతుగా విచారణ చేసింది.

ఇందులో భాగంగా సదరు టూర్ గైడ్ సెనుర రష్మిక సోదరుడు కవిందును సంప్రదించింది. వీరిద్దరూ శ్రీలంకలోని మిరిస్సా ప్రాంతంలో టూరిజం రంగంలో పనిచేస్తున్నారు.

కవిందు తెలిపిన వివరాల మేరకు ఈ ఘటన నవంబర్ 8న మిరిస్సా సముద్ర తీరంలో చోటుచేసుకుంది. కొలంబోకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి ఫారిన్ టూరిస్ట్‌లు ఎక్కువగా వస్తుంటారు.

End of ఎక్కువమంది చదివినవి

''నిజానికి దీన్ని అపార్థం చేసుకున్నారు. ఈ పర్యటకుల బృందం మాకు చాలా ఏళ్లుగా తెలుసు. 2018 నుంచి ఇజ్రాయెల్‌కు చెందిన ఆ బృందంతో మాకు పరిచయం ఉంది. రెస్టరెంట్ ఏర్పాటు చేసుకోవడానికి, పడవలు కొనుగోలు చేయడానికి కూడా వారు మాకు సాయం చేశారు. మా రెస్టరెంట్‌కు గుర్తింపు రావడానికి కూడా వారే కారణం. ప్రతి ఏడాది వారు ఇక్కడికి వస్తుంటారు. మేమంతా సోదరుల్లా కలిసిమెలిసి ఉంటాం'' అని కవిందు బీబీసీ సింహళ సర్వీస్‌కు ఫోన్‌లో తెలిపారు.

''ఆ సమయంలో మేమంతా సరదాగా గడుపుతూ వీడియోలు తీసుకుంటున్నాం. మొదట నా సోదరుడే వారిని నీళ్లలోకి తోశాడు. ఆ తర్వాత వారు నా సోదరుడిని ఎత్తి సముద్రంలో పడేశారు. నన్ను కూడా నీళ్లలోకి తోశారు. తర్వాత మేమంతా తిరిగి పడవ ఎక్కాం. మేం వాటర్ స్పోర్ట్స్‌ ఆడుతున్న టైంలో ఈ వీడియో తీశారు. ఆ తర్వాత దాన్ని ఓ గ్రూపులో పోస్ట్ చేశారు'' అని కవిందు వివరించారు.

''ఆ గ్రూపులో ఉన్న ఓ వ్యక్తి ఈ వీడియోను తీసుకుని, దాన్ని పెద్ద వివాదంగా మార్చాడు. సరదాగా తీసిన వీడియో ఇంత పెద్ద సమస్యగా మారింది'' అని ఆయన చెప్పారు.

బీబీసీ సంప్రదించిన సమయంలో సెనుర పర్యటకుల బృందంతో కలిసి పడవ ప్రయాణంలో ఉన్నారు. దీంతో ఆయన నేరుగా మాట్లాడలేకపోయారు.

అయితే ఘటన జరిగిన తర్వాత సెనుర స్వయంగా రికార్డు చేసిన ఓ వీడియోను ఆయన సోదరుడు బీబీసీకి అందించారు.

ఆ వీడియోలో ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో సెనుర వివరించారు.

''ఇటీవల మేం కొందరు గెస్ట్‌లతో కలిసి విహారయాత్రకు వెళ్లాం. అక్కడ చిన్న సంఘటన జరిగింది. దాన్ని పెద్దది చేయద్దు. నేనే వారిని నీళ్లలోకి తోశాను. వారంతా మా పాత స్నేహితులు. మాతో చాలా బాగా ఉంటారు'' అని సెనుర ఆ వీడియోలో చెప్పారు.

రష్యా మీడియా సంస్థ ఆర్‌టీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో.. సెనుర పడవలో కూర్చుని బాటిల్‌లోని నీళ్లు తాగుతూ కనిపిస్తున్నారు. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న ఇజ్రాయెల్ పర్యటకుడు ఒక్కసారిగా ఆయన్ని సముద్రంలోకి తోసేశారు. ఈ ఘటనను చూసి పడవలో ఉన్న మిగతావారు నవ్వుతున్న దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించిన ఎడిట్ చేయని ఒరిజినల్ ఫుటేజీని సంపాదించేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది. కానీ అదింకా లభించలేదు.

ఈ ఆరోపణలపై వివరణ కోరేందుకు సంబంధిత పర్యటకులను కూడా బీబీసీ సంప్రదించేందుకు ప్రయత్నించింది.

కవిందు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ పర్యటకులు నవంబర్ 10న శ్రీలంక నుంచి తిరిగి వెళ్లాల్సి ఉంది.

''వారు ఇప్పటికే వెళ్లిపోయి ఉంటారు'' అని కవిందు తెలిపారు.

End of content

ఫొటో సోర్స్, PROVIDED

''మేం ఇజ్రాయెల్‌కు వెళ్లి ఇలా చేసి ఉంటే?''

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశ, విదేశాల్లో చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఆ విదేశీ పర్యటకుడి చర్యపై పలువురు తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

''మేం ఇజ్రాయెల్‌కు వెళ్లి ఇలా చేసి ఉంటే, అక్కడి చట్టాలు మాపై కఠినంగా వ్యవహరించేవి. ఈ ఘటనపైనా తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి'' అని ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

''దీన్ని సరదాగా తీసుకోలేం. సముద్రం మధ్యలో ఒకరిని ఇలా ఒక్కసారిగా తోసేయడం వల్ల పడవ ఇంజిన్‌లో చిక్కుకోవచ్చు లేదా నీటిలో మునిగిపోవచ్చు. దీనివల్ల తీవ్ర గాయాలు కావచ్చు. ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది'' అని కొందరు విమర్శించారు.

''శ్రీలంక సంస్కృతిలో ఎవరైనా ఆహారం తింటున్నప్పుడు లేదా నీళ్లు తాగుతున్నప్పుడు వారికి ఆటంకం కలిగించకూడదని నేర్పిస్తారు. మంచి పిల్లలుగా భావించే ఈ బృందానికి వారి తల్లిదండ్రులు లేదా పెద్దలు ఈ విషయాన్ని నేర్పించలేదని తెలిసి చాలా బాధగా ఉంది'' అని ఓ శ్రీలంక జర్నలిస్ట్ డేనియల్ అమ్రామ్ ఎక్స్ పోస్టుకు స్పందించారు.

పోలీసుల దర్యాప్తు

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. దీంతో ఈ ఘటనపై కొట్టవిల పోలీస్ స్టేషన్ అధికారులు విచారణ చేపట్టారు.

''ఆ పర్యటకులను ఇక్కడి టూరిస్ట్ పోలీసుల వద్దకు తీసుకెళ్లాం. తాము ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం సరదా కోసమే అలా చేశామని వారు చెప్పారు'' అని కవిందు బీబీసీకి తెలిపారు.

ఆ పర్యటకులు తమ స్నేహితులేనని చెప్పినట్లు కొట్టవిల పోలీస్ అధికార ప్రతినిధి బీబీసీ సింహళ సర్వీస్‌కు వెల్లడించారు.

దీంతో ఈ ఘటనపై ఇకపై ఎలాంటి తదుపరి విచారణ చేపట్టబోమని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇంకా తెలుసుకోండి

షార్ట్ వీడియోలు

షార్ట్ వీడియోలు ముగింపు

‘పిరికివాళ్లు’గా గుర్తించి సైనికులకు మరణశిక్ష విధించిన దేశం ఏదంటే...

ఆర్యవీర్ సెహ్వాగ్: డబుల్ సెంచరీ చేసిన తన కుమారుడిని చూసి ‘ఫెరారీ మిస్ అయ్యావని’ సెహ్వాగ్ ఎందుకన్నారు?

‘బంగ్లాదేశ్ మురికి‌ వాడలను దిల్లీ నగరంగా ప్రచారం చేస్తున్న చైనా వ్లాగర్లు’: భారత్ అసంతృప్తి

సోనియా గాంధీ ఆత్మకథ:సంజయ్ గాంధీ మరణం తర్వాత చిన్నకోడలు మేనక ఇల్లు వదిలి ఎందుకు వెళ్లిపోయారు?

మీరా మాఝీ: ప్రధాని మోదీ టీ తాగిన ఇల్లు ఆమెది, కానీ ఆ ఇంటికి ఇప్పుడు రికవరీ ఏజెంట్లు ఎందుకు వస్తున్నారు?

‘‘ఏడాది వయసు వచ్చినా సొంతంగా కూర్చోలేకపోవడంతో అనుమానం వచ్చింది’’ - ప్రపంచ వ్యాప్తంగా 130 మందికి మాత్రమే ఉన్న ఈ అరుదైన రుగ్మత ఏంటి?

ముఖ్యమైన కథనాలు

ఏకకాలంలో పలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వ్యక్తి మోసం ఎలా బయటపడింది?

శ్రీలంక వ్యక్తిని సముద్రంలోకి తోసిన ఇజ్రాయెల్ టూరిస్టు వీడియో వైరల్.. అసలేం జరిగింది?

ఫీచర్లు

పాపులర్